AUS vs PAK 2nd Test: పాకిస్తాన్‌తో రెండో టెస్టు.. భారీ ఆధిక్యంలో ఆసీస్

by Vinod kumar |
AUS vs PAK 2nd Test: పాకిస్తాన్‌తో రెండో టెస్టు.. భారీ ఆధిక్యంలో ఆసీస్
X

మెల్‌బోర్న్ : పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మిచెల్ మార్ష్(96), స్టీవ్ స్మిత్(50) సత్తాచాటడంతో మూడో రోజు ఆటలో 241 పరుగుల ఆధిక్యం సాధించింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 194/6తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ మరో 70 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రిజ్వాన్(42) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. అమీర్ జమాల్(33 నాటౌట్), షాహీన్ అఫ్రిది(21) విలువైన పరుగులు జోడించారు. కమిన్స్(5/48), నాథన్ లియోన్(4/73) ధాటికి పాకిస్తాన్ 264 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్ 318 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదట్లో తడబడింది.

ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(0), డేవిడ్ వార్నర్(6)తోపాటు లబుషేన్(4), ట్రావిస్ హెడ్(0) విఫలమవడంతో 16 పరుగుల 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, మిచెల్ మార్ష్(96), స్టీమ్ స్మిత్(50) రాణించి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 153 పరుగుల భాగస్వామ్యం జోడించింది. మిచెల్ మార్ష్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మిర్ హంజా అతన్ని అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం అలెక్స్ కేరీ(16 బ్యాటింగ్) సహకారంతో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, కాసేపటికే అతన్ని షాహీన్ అఫ్రిది పెవిలియన్ పంపాడు. స్మిత్ వికెట్‌తో అంపైర్లు మూడో రోజు ఆట ముగిసినట్టు ప్రకటించారు. 62.3 ఓవర్లలో ఆస్ట్రేలియా 6 వికెట్లను కోల్పోయి 187 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మిర్ హంజా మూడేసి వికెట్లు తీశారు. నాలుగు వికెట్లు చేతిలో ఉండగా ఆసిస్.. పాక్ ముందు 300 లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది. ఛేదన కష్టమైన ఈ పిచ్‌పై పాక్ ఏ మేరకు పోరాడుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed